Sanjay Raut : మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్ష నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం, బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలను విస్మరించడం వంటి చర్యలను ఎండగడుతూ విపక్ష ఇండియా కూటమి నేతలు మోదీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విపక్ష నేతలు విమర్శించారు. కాషాయ పాలకులు కేజ్రీవాల్‌ను కటకటలపాలు చేయలేదని, వారు ఏకంగా దేశ ప్రజాస్వామ్యానికే సంకెళ్లు వేశారని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఎక్సైజ్ స్కామ్ కేసులో జైలులో నిర్బంధించిన కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి మొత్తం నిలబడిందని భరోసా ఇచ్చారు. ఇక ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. విపక్ష ఇండియా కూటమి నిరసన సందర్భంగా ఆప్ నేత రాఘవ్ చద్దా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇండియా కూటమి సత్తా, ఐక్యత ఏంటో ఈరోజు వెల్లడైందని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యోగక్షేమాల గురించి, దిగజారుతున్న ఆయన ఆరోగ్యం గురించి కలత చెందేవారు ఈరోజు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. ఎక్సైజ్ స్కామ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు తాను ఎన్డీయే పాలకుల గురించి హెచ్చరించానని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఎన్నో సంస్ధలున్నాయని, వాటిని అడ్డుపెట్టుకుని ఎప్పటికప్పుడు రాజకీయ నేతలను వేధిస్తారని చెప్పానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉన్న దర్యాప్తు ఏజెన్సీలు పాలక పార్టీ రాజకీయ ప్రత్యర్ధులకు న్యాయం చేయవని, తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్ధల కుట్రలకు చరమగీతం పాడతామని చెప్పానని గుర్తుచేశారు.
Read More :
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. మరో రెండు గేట్లు ఎత్తివేత