Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్లోకి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తుండటంతో సోమవారం 3 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీంతో మొత్తం 5 గేట్ల నుంచి 1,42,000 క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తున్నది.
ఎగువ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఏపీ సాగునీటి శాఖ సీఐ కబీర్ బాషా, ఎస్ఈ రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు కుంకుమ, సారె సమర్పించారు. అనంతరం మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టుకు సంబంధించిన 6, 7, 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తగా.. 81వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. అయినప్పటికీ భారీగా వరద నీరు వస్తుండటంతో ఇవాళ మరో రెండు గేట్లను ఎత్తారు.
#శ్రీశైలంలో 5 గేట్లు ఎత్తి 1,42,000 క్యూసెక్యుల నీరు విడుదల #Srisailam #KrishnaFloods #AndhraPradesh pic.twitter.com/IkcIBBYISF
— Subrahmanyam Kopalle (@sanjusubbu) July 30, 2024
శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారడంతో పాటు.. గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల నుంచి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మను చూసి పులకరించిపోతున్నారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.