Sanjay Raut Bail | శివసేన (ఉద్దవ్ వర్గం) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్‌కు బుధవారం ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. సంజయ్ రౌత్‌తోపాటు ఆయన అనుచరుడు ప్రవీణ్ రౌత్ బెయిల్ పిటిషన్లను విచారించిన ప్రత్యేక న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో వీరు గత 102 రోజులుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో శివసేన (ఉద్దవ్ వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను గత ఏడాది జూలై 31 న దాదాపు 9 గంటలపాటు విచారించింది. అంతకుముందు జూన్ 28 న కూడా ఈడీ ఆయనను ప్రశ్నించింది. దీని కన్నా ముందు రెండు సార్లు ఈడీ విచారణకు హాజరవకుండా రౌత ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారు. సంజయ్ రౌత్ రూ.1,039 కోట్ల పట్రాచాల్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించారు. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం.. వీరి బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని అక్టోబర్ 21న రిజర్వ్ చేసింది.
ఉద్దవ్ ఠాక్రే వర్గానికి పెద్ద గొంతుగా ఉండే సంజయ్ రౌత్ జైలుకెళ్లడంతో ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఆయన వర్గీయులు చల్లబడిపోయారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీతో ఏక్నాథ్ షిండే వర్గం జతకట్టడాన్ని సంజయ్ రౌత్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ కక్షలతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని సంజయ్ రౌత్ ఆరోపించారు. కాగా, సంజయ్ రౌత్ ఆరోపణలను ఈడీ తిరస్కరించింది. మనీలాండరింగ్ నేరంలో రౌత్ ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నది.