Sanjay Raut | మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి (Maharashtra CM) ఎవరన్నది ఇంకా తేలలేదు. నాలుగు రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. గత శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలన్నారు (Presidents Rule In Maharashtra).
‘అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. నవంబర్ 26వ తేదీతో శాసనసభ పదవీకాలం కూడా ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిని కూడా నిర్ణయించలేదు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ షిండేను కోరారు.
Also Read..
Digital Arrest: ఐఐటీ బాంబే విద్యార్థి డిజిటల్ అరెస్టు.. అతని అకౌంట్ నుంచి 7 లక్షలు మాయం
Eknath Shinde | ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే.. ప్లాన్-బీని సిద్ధం చేసిన షిండే వర్గం..!
Adani issue | అదానీ అంశంపై పార్లమెంట్లో రచ్చ.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా