ముంబై: ఐఐటీ ముంబై విద్యార్థి దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి డిజిటల్ అరెస్టుతో రూ.7.29 లక్షలు కాజేశారు. ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ ఓ వ్యక్తి అతన్ని బెదిరించాడు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టులు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జూలైలో ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి 25 ఏళ్ల స్టూడెంట్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ట్రాయ్ ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నామని, మొబైల్ నెంబర్‌పై 17 ఫిర్యాదులు ఉన్నాయని అతను బెదిరించాడు. అయితే నెంబర్‌ను డీయాక్టివేట్ చేయకుండా ఉండేందుకు .. పోలీసుల నుంచి ఎన్వోసీ సర్టిఫికేట్ అవసరం ఉంటుందని ఆ ఉద్యోగి స్టూడెంట్‌కు చెప్పాడు.
ఫోన్ కాల్‌ను సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు అతను చెప్పాడు. ఆ తర్వాత వాట్సాప్ కాల్లో ఓ వ్యక్తి పోలీసు ఆఫీసర్ దుస్తుల్లో కనిపించాడు. బాధితుడి ఆధార్ నెంబర్ అడిగాడతను. ఆ నెంబర్ నుంచి మనీల్యాండరింగ్ జరుగుతున్నట్లు ఆరోపించాడు. యూపీఐ ద్వారా 29 వేలు ట్రాన్స్ఫర్ చేసేలా విద్యార్థిని వత్తిడి చేశాడు. ఆ తర్వాత డిజిటల్ అరెస్టు చేసిన విద్యార్థిని ఎవరితో కాంటాక్టు కాకుండా చేశాడు. తర్వాత రోజు ఫోన్ చేసి మరిన్ని డబ్బులు డిమాండ్ చేశాడు.
ఆ సమయంలో బాధితుడు తన బ్యాంక్ వివరాలను వెల్లడించాడు. అప్పుడు అతని అకౌంట్ నుంచి ఏడు లక్షలు కాజేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత.. ఇక ఎటువంటి అరెస్టులు ఉండవని స్టూడెంట్‌కు నిందితుడు భరోసా ఇచ్చాడు. డిజిటల్ అరెస్టు గురించి ఆన్లైన్లో తెలుసుకున్న తర్వాత.. ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.