న్యూఢిల్లీ, మే 30 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. పహల్గాంలో ఆరుగురు ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారని, వారు బీజేపీలో చేరుతారేమోనని ఆరోపించారు. ‘ఆరుగురు తీవ్రవాదులు అక్కడ ఇంకా పట్టుబడలేదు. బహుశా వారు బీజేపీలో చేరారంటూ ఒకరోజు బీజేపీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల కావొచ్చు’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని, భారత సైనికులు నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ క్రెడిట్‌ను ఆయన కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన రాష్ట్రం రాష్ట్రం తిరుగుతూ అదంతా తన ఘనతే అని చెప్పకోవడానికి తంటాలు పడుతున్నారన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఒక లేఖను అందిస్తాయన్నారు.