న్యూఢిల్లీ : అసత్యాలు ఎల్లకాలం రాజ్యమేలవు. సత్యం ఏనాటికైనా జయిస్తుంది. ఎప్పుడూ ఒకరిమాటే చెల్లుబాటు అవుతుందని భావించడం పొరపాటు. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది అదే. తన కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి బీజేపీ ఎందుకు ఇంత జాప్యం చేస్తోంది? ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాన్ని శిరసావహించే రోజులు ఇప్పుడు పోయాయి. అంతర్గత ప్రతిఘటన రాజుకుంటోంది. మోదీ-అమిత్‌షాల ద్విఛత్రాధిపత్యాన్ని బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఇక ఎంతమాత్రం సహించే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమిత్ షాకు డమ్మీగా ఉండే బీజేపీ అధ్యక్షుడిని ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని చెబుతున్నారు. మోదీ-షా ద్వయం కబంధ హస్తాల నుంచి పార్టీకి విముక్తి కల్పించాలని సంఘ్ భావిస్తున్నదని పేర్కొంటున్నారు.
బీజేపీ అనే రాజకీయ పార్టీ ఉండాలని కోరుకుంటోందే తప్ప మోదీకి జీహుజూర్ అనే వ్యవస్థను సంఘ్ కోరుకోవడం లేదు. ఈ హోరాహోరీ పోరే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో తీవ్ర జాప్యానికి ప్రధాన కారణంగా కనపడుతున్నది. ఈ పోరు ఎంత తీవ్రస్థాయి వరకు వెళ్లిందంటే మోదీ తన ప్రధాన ప్రత్యర్థిగా భావించే సంజయ్ జోషి పేరును పార్టీ కొత్త అధ్యక్షుడిగా ప్రతిపాదించే వరకు. అత్యంత నీచమైన కుట్ర కారణంగా ప్రధాన రాజకీయ స్రవంతి నుంచి అవమాన భారంతో వైదొలగాల్సి వచ్చిన సంజయ్ జోషి పేరును ఆర్ఎస్ఎస్ సూచించడం బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
సంఘ్‌కు అత్యంత విధేయుడైన కార్యకర్తగా ఉన్న సంజయ్ జోషి ఓ నకిలీ వీడియోతో పరువు ప్రతిష్ట పోగొట్టుకున్నారు. ఓ మహిళతో శృంగారం సాగిస్తున్న దృశ్యాలు ఆ నకిలీ వీడియోలో ఉన్నాయి. అటువంటి పనికి జోషి పాల్పడరని ఆర్ఎస్ఎస్కి తెలుసు. ఇప్పుడు ఆయన ప్రతిష్టను తిరిగి నిలబెట్టాలని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ భావిస్తున్నారు. మోదీషా ద్వయానికి ఆమోదయోగ్యం కాదని తెలిసినప్పటికీ సంజయ్ జోషి పేరును పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆయన సూచించారు. పార్టీపై వారిద్దరి గుత్తాధిపత్యానికి ఇది సవాలు సమయం.