Sandeep Pathak : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడాన్ని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు. ఇది ఘన విజయమని, ఈ విజయం కేవలం తమదే కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ వెలువరించిన తీర్పు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పారు.
ఈ తరహా నియంతృత్వ పోకడలు చెల్లవని, వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకుని ఎంతోకాలం సాగించలేరనేందుకు కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని అన్నారు. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత బెయిల్‌పై మనీష్ సిసోడియా బయటకు వస్తారని, ముందుగా కేజ్రీవాల్ వద్దకు వెళ్లి ఆపై నేరుగా తమ ఇంటికి చేరుకుంటారని చెప్పారు. మనీష్ సిసోడియా శనివారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌ఘాట్ సందర్శిస్తారని, ఆపై దేవాలయానికి వెళతారని తెలిపారు.
ఆపై వలంటీర్ల బృందంతో ముచ్చటించి పార్టీ కార్యాలయంలో జరిగే గెట్ టూ గెదర్‌కు హాజరవుతారని సందీప్ పాఠక్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులను వేధిస్తోందని దుయ్యబట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలతో విపక్ష నేతలను వెంటాడుతున్నదని ఆరోపించారు.
Read More :
Brutal murder | పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు