న్యూఢిల్లీ : రైతులపై కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై పోరాటం జరిపి విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజల దృష్టికి తేవడంపై దృష్టి సారించింది. ఇంటింటికీ ప్రచారం నిర్వహించి సుమారు 12 కోట్ల కుటుంబాల దృష్టికి రైతుల ఇబ్బందులను, డిమాండ్లను తీసుకువెళ్లాలనే ధ్యేయంతో ప్రచారాన్ని ప్రారంభించింది.మద్దతు ధర, పంట రుణాల రద్దు, విద్యుత్ రంగం ప్రైవేటీకరణ తదితర అంశాలను మోర్చా ప్రజలకు వివరిస్తుంది.
ఈ నెల 16న జలంధర్లో జరిగే జాతీయ సభలో ఈ సమస్యలపై చర్చించనున్నారు. 2021లో రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని ఎస్కేఎం ఆరోపించింది. ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్పొరేట్లకు లాభం చేకూరుస్తున్నదే తప్ప వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంటలు నష్టపోతున్న రైతులకు ప్రయోజనాన్ని కల్పించడం లేదని పేర్కొంది. బీమా కంపెనీలు 2022-23లో రూ.27,900.78 కోట్లను రైతుల నుంచి ప్రీమియంగా వసూలు చేపి కేవలం రూ.5760.80 కోట్లను మాత్రమే క్లెయిములుగా చెల్లించాయని ఎస్కేఎం
ఆరోపించింది.