Shivraj Singh Chouhan | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయశాఖ కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిరసన తెలిపింది. 2017 జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని మందాసౌర్లో ఆరుగురు రైతుల హత్యకు శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యత వహించాలని ఎస్కేఎం ఓ ప్రకటనలో తెలిపింది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధర ఇవ్వాలని రైతుల ఆత్మహత్యలను నివారించడానికి సమగ్ర రుణ మాఫీ పథకం తీసుకు రావాలని కోరుతూ ఆందోళనకు దిగిన రైతులను హత్యకు గురి చేశారని ఆరోపించింది. 2017 జూన్‌లో మధ్యప్రదేశ్ లోని మందాసౌర్లో ఆందోళనకు దిగిన రైతులపై సీఆర్పీఎఫ్, పోలీసు బలగాల కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు.
తర్వాత కాలంలో కేంద్రం చేసిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు ఎస్కేఎం సారధ్యం వహించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ సంక్షోభానికి కారణాల పరిష్కారానికి ఎన్డీఏ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఎస్కేఎం ఆరోపించింది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల ఆత్మహత్యల నివారణ, మద్దతు ధర తదితర అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో వచ్చేనెల 10న జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని ఎస్కేఎం తెలిపింది. తమ సంస్థలో భాగస్వామ్య సంఘాల నేతలు ఈ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారని పేర్కొంది.