Akhilesh Yadav : తమిళనాడు (Tamil Nadu) లో డీఎంకే కూటమి (DMK Alliance) కి, పశ్చిమ బెంగాల్ (West Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కి ఐ-ప్యాక్ (I-Pack) ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఆ రెండు పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. ఈ ఓటముల తర్వాత రెండు రోజులకే ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కీలక నిర్ణయం ప్రకటించారు. ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. అయితే అందుకు డీఎంకే, టీఎంసీ ఓటములను కాకుండా నిధుల కొరతను కారణంగా చూపించారు.
కాగా వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐ-ప్యాక్‌తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్నామని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఐ-ప్యాక్ టీమ్ తమతో కొన్ని నెలలు పని చేసిందని, కానీ నిధుల కొరత కారణంగా దానిని కొనసాగించలేకపోతున్నామని చెప్పారు. బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఐ-ప్యాక్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘మా వద్ద నిధులు లేవు. మీరు (మీడియా) నిధులు ఇస్తే మరో కంపెనీని ఎన్నికల కోసం నియమించుకుంటాం’ అని అఖిలేష్ సరదాగా అన్నారు.
కానీ ఐప్యాక్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రెండు పార్టీలు ఓడిపోయిన అనంతరం అఖిలేష్ యాదవ్ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలావుంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీరును అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దీనిని సుప్రీంకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు వీడియో రికార్డింగును ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. బెంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.