న్యూఢిల్లీ : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశ విదేశాంగ విధానం మారాలని, పాకిస్థాన్పైన మొదట దృష్టి సారించాలని ఆయన ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిలుపునిచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ను సందర్శించిన ప్రతిసారి తనకు సొంత ఇంట్లో ఉన్నట్లు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మూడు దేశాలు కొంతకాలం అలజడి తర్వాత పాలనాపరమైన మార్పులకు లోను కావడం ఆసక్తికరం. హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు ఉన్నప్పటికీ పాక్, బంగ్లాదేశ్‌తో భారత్ చర్చలు జరపాలని పిట్రోడా సూచించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీరులోని పహల్గాంలో 25 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పిట్రోడా పిలుపునివ్వడం గమనార్హం. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు భారత క్రికెట్ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది.