Rahul Gandhi | లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మెరుగైన వ్యూహకర్త అని.. ఆలోచనాపరుడని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. రాహుల్‌కు కాబోయే ప్రధానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత త్వరలో అమెరికాలో పర్యటించనున్న తెలిసిందే. పర్యటనపై బీజేపీ చేసిన విమర్శలు పిట్రోడా విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యక్తిగత స్థాయిలో కాపిటల్ హిల్ వద్ద కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతారని.. జార్జ్‌టౌన్ విశ్విద్యాలయంలోనూ విద్యార్థులను కలుస్తారన్నారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్, పీవీ సింగ్, చంద్రశేఖర్, హెచ్‌పీ దేవెగౌడ వంటి పలువురు ప్రధానులతో తాను కలిసి పని చేశానన్న ఆయన.. రాహుల్, రాజీవ్ మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ.. రాహుల్ మేధావి, ఆలోచనాపరుడని చెప్పారు.
రాజీవ్ కొంచెం ఎక్కువగా పని చేసేవాడన్నారు. ఇద్దరి డీఎన్ఏ ఒకటేనని.. ఆందోళనలు ఒకటేనన్నారు. రాహుల్ మెరుగైన భారత్‌ను నిర్మించాలని భావిస్తున్నాడని.. అతనికి వ్యక్తిగత అవసరాలు కూడా ఏమీ లేవన్నారు. రాజీవ్ కంటే రాహుల్ మంచి వ్యూహకర్త అని పేర్కొన్నారు. వారికి వేర్వేరు సమయాలు, విభిన్న సాధనాలు, విభిన్న అనుభవాలు ఉన్నాయని.. రాహుల్ జీవితంలో రెండు భారీ ఎదురుదెబ్బలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. మొదటి అమ్మమ్మ మరణం, రెండోది ఆయన తండ్రి మరణమన్నారు. రాహుల్ ఇమేజ్ పెరుగుతోందని.. భారత్ జోడో యాత్ర ఎంతో ఉపకరించిందన్నారు. ఆయన పరువు తీసేందుకు లక్షల డాలర్లు వెచ్చించారని విమర్శించారు. రాహుల్ గాంధీకి చాలాకాలం పోరాడుతున్నారని.. మరొకరయితే బ్రతికేవారు కాదన్నారు. ప్రజలకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేరన్నారు. రాహుల్ ప్రధాని పదవికి సమర్థుడని తాను భావిస్తున్నానని.. నాగరికత తెలిసిన వ్యక్తి అని.. కాబోయే ప్రధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు.