భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మైనర్లకు, బాలికలకు యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. యూనిఫాంలో వచ్చిన విద్యార్థినులు ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాండ్లా జిల్లాలోని నైన్పూర్లో ఈ ఘటన జరిగింది.
కొందరు విద్యార్థినులు ప్రభుత్వ మద్యం దుకాణంలోకి వెళ్లడం, మద్యం ఇవ్వాలని కౌంటర్ వద్ద అడగటం, వారు మైనర్లు అయినప్పటికీ అక్కడి సిబ్బంది వారికి మద్యం అమ్మడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశుతోష్ ఠాకూర్, పోలీసులు హుటాహుటిన ఆ దుకాణానికి వెళ్లి విచారణ జరిపారు. మైనర్లకు మద్యం అమ్మినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు చేసి, నివేదికను సమర్పించాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. మద్యం దుకాణం లైసెన్స్‌ను రద్దు చేసి జరిమానా విధిస్తామని చెప్పారు.