న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిన సురక్షిత గాలి నాణ్యత స్థాయికి ఎనిమిది రెట్లు ఎక్కువ విషపూరిత కణాలు గల గాలిని ప్రతి భారతీయుడు పీలుస్తున్నాడు. ఇంత ఎక్కువ స్థాయిలో విషపూరిత కణాలను పీల్చుకోవడం వల్ల భారతీయుల సగటు ఆయుష్షు 3.5 సంవత్సరాలు తగ్గిపోతున్నది. అత్యధిక కాలుష్యం గల ఢిల్లీ నగరంలో ప్రతి ఒక్కరూ 8.2 సంవత్సరాలు నష్టపోతారు. ఉత్తరాది కన్నా దక్షిణాది కొంత వరకు మెరుగైన స్థితిలో ఉంది.
డబ్ల్యూహెచ్వో సిఫారసు చేసిన స్థాయికి గాలి కాలుష్యాన్ని తగ్గించగలిగితే, కర్ణాటకలో ప్రతి ఒక్కరూ అదనంగా 1.6 సంవత్సరాలు, ఆంధ్ర ప్రదేశ్లో 2.1 సంవత్సరాలు, తెలంగాణలో 2.4 సంవత్సరాలు, తమిళనాడులో 1.7 సంవత్సరాలు, కేరళలో 1.3 సంవత్సరాలు జీవించగలుగుతారు. చికాగో విశ్వవిద్యాలయం నేతృత్వంలోని గ్లోబల్ టీమ్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది. 2023 నాటి పరిస్థితులను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు.