Sachin Pilot : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శించడం ఒక్కటే బీజేపీ అజెండా అని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్ధితులు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండటంతో కాషాయ పార్టీలో అసహనం నెలకొందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతుంటే పేదల పరిస్ధితి నానాటికీ దిగజారుతున్నదని అన్నారు. నిరుద్యోగం దేశంలో ప్రధాన సమస్యగా ముంచుకొచ్చిందని చెప్పారు. పెద్దసంఖ్యలో యువత నిరుద్యోగులుగా మారతున్నారని, ఇది ప్రభుత్వ విధానాల వైఫల్యానికి సంకేతమని సచిన్ పైలట్ పేర్కొన్నారు. కాగా, పదేండ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అంతకుముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఖర్గే శ్రీనగర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత పదేండ్లలో బీజేపీ చేసింది శూన్యమని, ఎక్కడైనా బ్రిడ్జిని ప్రారంభిస్తే అది కుప్పకూలుతోందని, అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభిస్తే ఆలయం నుంచి నీరు కారుతోందని వ్యాఖ్యానించారు.
ప్రతిచోటా మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని, పవిత్ర హస్తంతో ప్రారంభోత్సవం చేయాలని ప్రజలు అంటున్నారు, ఇప్పుడు అది పవిత్ర హస్తమో, మరే హస్తమో నాకు తెలియడం లేదని అన్నారు. ఇవాళ దేశంలో మైనారిటీ ప్రభుత్వం కొలువుతీరిందని, లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ 400కుపైగా స్ధానాలు గెలుచుకుంటామని ప్రగల్బాలు పలికిందని గుర్తుచేశారు. మరి మీ 400 సీట్లు ఎక్కడున్నాయని ఎద్దేవా చేశారు. 400పైగా సీట్లు సాధిస్తామని డప్పు కొట్టుకున్న కాషాయ పార్టీకి అతికష్టం మీద 240 స్ధానాలే దక్కాయని వ్యాఖ్యానించారు.
Read More :
Devara | ఎన్టీఆర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి.. బ్లడ్ క్యాన్సర్ బాధితుడి వేడుకోలు