Sabarimala gold scam case | శబరిమల ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 2019లోనే ఆలయంలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలుండగా.. ఆ సమయంలోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆయనను సస్పెండ్ చేసింది. సిట్ ఆయనను అదుపులోకి తీసుకొని తిరువనంతపురంలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బంగారం ఫ్రాడ్ కేసులో సిట్ రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌తో పాటు పది మందిని నిందితులుగా పేర్కొంది.
రెండు ఎఫ్ఐఆర్లలో మురారి బాబును నిందితుడిగా చేర్చింది. 2019 నుంచి 2024 వరకు జరిగిన కుట్రలో బాబు కీలక లింక్‌గా సిట్ భావిస్తున్నది. అయితే, ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మురారి బాబు తన పాత్ర ఉన్నట్లుగా వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ప్రాథమిక నివేదికను మాత్రమే సమర్పించానని.. తుది ఆమోదం ఉన్నతాధికారుల నుంచి వచ్చిందని చెప్పుకొచ్చారు. మరో వైపు సిట్ ఈ కేసులో సాక్షుల వాంగ్మూలం నమోదు చేసుంది. బంగారం తాపడం తొలగింపు పనులు మొదలైనప్పటి నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, ఆలయ సిబ్బందిని సిట్ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉన్నికృష్ణన్ను అక్టోబర్ 30 వరకు స్థానిక కోర్టు సిట్ కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో సిట్ ఆధారాలను సేకరించేందుకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి వెళ్లే అవకాశం ఉంది.