న్యూఢిల్లీ: విదేశాంగ విధానంలో సొంత నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన తేటతెల్లం చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ విశ్వ వేదికపైన భారత్ ఎదుగుతున్న తరుణంలో కీలక భాగస్వామ్య దేశాలతో మెరుగైన సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరాదని భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో జరిగిన పుతిన్ భారత పర్యటనపై అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ బహుళ భాగస్వాములతో విశాల సహకారం ప్రాతిపదికన భారత విదేశాంగ విధానం రూపొందిందని జైశంకర్ చెప్పారు.