LAC | న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత్-చైనా మధ్య తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్-చైనా మధ్య గత కొన్నివారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చర్చల ఫలితంగా ఎల్ఏసీ వెంబడి గస్తీ ఏర్పాట్లపై అంగీకారం కుదిరిందని, ఇది తూర్పు లఢక్‌లో బలగాల ఉపసంహరణకు దారితీస్తుందని తెలిపారు.
రష్యాలో జరుగనున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకున్నది. దీనిని కీలక పురోగతిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ విషయమై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి తూర్పు లఢక్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2020 జూన్ 15న జరిగిన ఆ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు, దాదాపు 40 మంది చైనా సైనికులు మరణించిన విషయం విదితమే. ఆ తర్వాత తాత్కాలికంగా బలగాలు వెనక్కి వెళ్లినప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడలేదు.