India Pakistan | న్యూఢిల్లీ, ఇస్లామాబాద్, మే 5: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పలు ఆంక్షల ద్వారా పాకిస్థాన్‌ను అష్ట దిగ్బంధం చేసిన భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలపై కూడా దృష్టి సారించింది. పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ సమాజం సహకారాన్ని కూడా పొందుతున్నది. దీంతో పాకిస్థాన్ పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కలా మారింది. పాక్‌పై పోరు విషయంలో ఇప్పటికే భారత్‌కు రష్యా , జపాన్ దేశాలు మద్దతు పలికి భారత్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. భారత్‌కు యుద్ధ నౌకలు పంపుతామని జపాన్ హామీ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మంగళవారం భారత్‌లో పర్యటించనున్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను భద్రతా మండలిలో ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతును ప్రకటించిన పుతిన్ పహల్గాం ఉగ్రవాదులను శిక్షించాల్సిందేనని స్పష్టం చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. తమ రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్న తమ సంకల్పాన్ని ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించినట్లు ఆయన చెప్పారు.
ఉగ్ర చర్యలపై పోరాడుతున్న భారత్‌కు జపాన్ సంఘీభావం తెలిపింది. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జపాన్ మంత్రి జనరల్ నకతానితో ప్రకటించారు. ‘కారణమేదైనా ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సమర్థనీయం కాదు. మేము అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా భారత్‌తో కలిసి ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. భారత్‌ను సందర్శించిన జపాన్ మంత్రి జనరల్ నకతానితో మన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం భేటీ అయ్యి కృతజ్ఞతలు తెలిపారు. ‘పహల్గాం దాడి క్రమంలో భారత్‌కు జపాన్ గట్టి సంఘీభావాన్ని వ్యక్తం చేసినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత్-జపాన్ రక్షణ సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి మీరు చేస్తున్న కృషికి అభినందిస్తున్నా’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
భారత్-పాకిస్థాన్ రెండు దేశాలూ సంయమనం పాటించాలని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరఖ్చి కోరారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన సోమవారం పాకిస్థాన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తగ్గాలని తాము కోరుకుంటున్నామని, ఇరు పక్షాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అబ్బాసీ పేర్కొన్నారు.అరఖ్చి పాకిస్థాన్ నుంచి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకుంటారని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ఎక్స్‌లో తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఐరాస భద్రతా మండలి సమావేశం కానుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఇస్తున్న మద్దతు, ఆ దేశం పాత్రను ఈ అంతర్జాతీయ వేదికలో భారత్ ప్రధానంగా ప్రస్తావించ నుంది. కాగా, పహల్గాం దాడిని ఖండిస్తూ ఇప్పటికే ఐరాస భద్రతా మండలి ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం భారత్‌తో యద్ధం చేసేందుకు పాక్ ఖజానాలో తగిననన్ని నిధులు లేవని ప్రపంచ రేటింగ్స్ సంస్థ మూడీస్కి చెందిన విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగిన కొద్దీ పాకిస్థాన్‌కు విదేశీ ఆర్థిక సాయం దెబ్బ తినడమే గాకుండా , విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరగడం ఖాయమని వారు హెచ్చరించారు. విదేశీ రుణ చెల్లింపులకు సంబంధించి మరి కొన్ని నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే ప్రస్తుతం పాక్ వద్ద లభ్యతలో ఉన్నాయని నివేదికలో మూడీస్ పేర్కొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఏడాదిగడువు తీరిపోయే రుణాలకు చెల్లింపునకు అవసరమైన నిధులు పాకిస్థాన్ దగ్గర ఇప్పటికే లేవని స్పష్టం చేసింది. భారత్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితే ఏర్పడితే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడం ఖాయమని హెచ్చరించింది.
అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, భారత్ విధిస్తున్న తీవ్ర ఆంక్షలతో అన్నివిధాల కుదేలవుతున్న పాకిస్థాన్.. ఒక వేళ భారత్ యుద్ధానికి దిగితే పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతాయని భయపడుతున్నది. పైకి మేకపోతు గాంభీర్యంతో అణు బెదిరింపులు చేస్తున్న ఆ దేశం యుద్ధ భారాన్ని తట్టుకునే పరిస్థితి ఏ మాత్రం లేదు. దీంతో ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలని పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే పలు దేశాల వారిని సంప్రదించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ రష్యాకు చెందిన మంత్రి సెర్గీ లావ్రోవ్తో టెలిఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఉద్రిక్తతలపై లావ్రోవ్ ఆందోళన వ్యక్తం చేయడమే కాక, ఈ సమస్యల పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించాలని కోరారు. భారత్ దూకుడు చర్యల కారణంగా ఇరు దేశాల శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడే పరిస్థితి ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని భద్రతా మండలిని సమావేశపర్చాలని ఐరాసకు పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది.