Tirumala : భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. తిరుమలలోని వీధులన్నీ బోసి పోయాయి. సాధారణంగా ఎక్కడ చూసినా భక్తుల రద్దీతో బిజీగా కనిపించే తిరుమలకు ఇప్పుడు భక్తులు పలుచగా వస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటం, జాతీయ రహదారులపై నీరు నిలవడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం లాంటి కారణాలవల్ల భక్తులు తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. వసతి గృహాల బుకింగ్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు లేరని తిరుమల అధికారులు తెలిపారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి.
భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటలలో పూర్తవుతుంది.
ఆదివారం తిరుమల శ్రీవారిని 74,498 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,355 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లకు చేరిందని అధికారులు చెప్పారు.