(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు లేక యువత తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. రైతుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి. అవినీతి పెచ్చరిల్లిపోయింది. ధనికులు కుబేరులుగా.. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. విదేశీ దౌత్యం వైఫల్యంతో నిన్నటివరకూ మిత్రులుగా ఉన్న దేశాలు ఇప్పుడు శత్రువులుగా మారాయి. మొత్తంగా ఎన్డీయే పాలనలో దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయమై కృత్రిమమేధ (ఏఐ) చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించగా.. మోదీ పాలనలో దేశం సత్తెనాశ్గా తయారయ్యిందని తేల్చి చెప్పింది.
మోదీ పాలనలో దేశంలో అసమానతలు పెద్దయెత్తున పెరిగాయని గ్రోక్ అభిప్రాయపడింది. దేశంలోని 40 శాతం సంపద ఒక్క శాతం మాత్రమే ఉన్న ధనవంతుల దగ్గర పేరుకుపోగా, కిందనున్న 50 శాతం మంది పేదల వద్ద కేవలం 6 శాతం సంపద మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నది. 2016లో పెద్ద నోట్లరద్దు నిర్ణయంతో అసంఘటిత రంగం కుదేలయ్యిందని, జీఎస్టీ నిర్ణయం చిన్న పరిశ్రమలను దెబ్బతీసిందని తేల్చి చెప్పింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆరేడు లక్షల కంపెనీలు మూతబడ్డట్టు వెల్లడించింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు ప్రచారానికే పరిమితమయినట్టు తెలిపింది. కేంద్రప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొలువుల భర్తీని మరచిపోయిందని, ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీని కూడా అటకెక్కించిందని తేల్చిచెప్పింది. దీంతో ఉద్యోగాలు లేకపోవడంతో యువత తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయినట్టు వెల్లడించింది.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని గప్పాలు కొట్టిన మోదీ ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోలేదని గ్రోక్ గుర్తు చేసింది. 11 ఏండ్ల ఎన్డీయే పాలనలో లక్షన్నర మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలిపింది. మూడు నల్లచట్టాల విషయంలో మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఇక, రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని కేంద్రం దర్యాప్తు సంస్థలను అక్రమంగా వాడినట్టు ఆరోపణలు ఉన్నాయన్న గ్రోక్.. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడమేనని అభిప్రాయపడింది. విధానపరమైన నిర్ణయాల్లో మోదీ సర్కారు వైఫల్యంతో జీడీపీ వృద్ధిరేటు మందగించిందని, ద్రవ్యలోటు పెరిగిందని గ్రోక్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి పతనం కొత్త కనిష్ఠాలకు చేరడంతో ద్రవ్యోల్బణం అదుపుతప్పినట్టు వెల్లడించింది.
విదేశీ దౌత్యంలోనూ మోదీ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైనట్టు గ్రోక్ అభిప్రాయపడింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్‌తోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలతోనూ భారత్‌కు ప్రస్తుతం సఖ్యత లోపించిందని అభిప్రాయపడింది. దీంతో విదేశాల్లో ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యావకాశాల కోసం చూసే వారికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వెల్లడించింది. తాము గెలిస్తే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి, ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానన్న మోదీ ఎన్నికల వాగ్దానం నిజం కాలేదని గ్రోక్ పేర్కొన్నది. గడిచిన 11 ఏండ్లలో దేశంలో అవినీతి పెరిగిపోయిందని వెల్లడించింది.