పట్నా: వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినంటూ ప్రకటిస్తూ వస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. గతంలో చాలా అరుదుగా మాత్రమే నిశాంత్ బహిరంగ కార్యక్రమాల్లో దర్శనం ఇచ్చేవారు. అయితే 73 ఏండ్ల నితీశ్ నాయకత్వం తర్వాత పార్టీకి వారసుడు ఎవరు? అని పార్టీ వర్గాల్లో చర్చ జరిగిందని, దాంతో నితీశ్‌కు వారసునిగా అతని కుమారుడిని రంగంలోకి దింపాలని పార్టీ వర్గాలు సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారానికి నితీశ్ సహచరుడు విద్యానంద్ చేసిన ఓ పోస్టు మరింత ఊతమిచ్చింది. ‘నేటి నవ రాజకీయ పరిస్థితులలో బీహార్‌కు యువ నాయకత్వం అవసరం. ఆ నాయకత్వ లక్షణాలన్నీ నిశాంత్ కుమార్లో ఉన్నాయి. ఇదే అభిప్రాయాన్ని జేడీ(యూ) పెద్దలకు తెలిపా’ అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారం అంతా ఆధారం లేనిదని మంత్రి విజయ్ కుమార్ కొట్టివేశారు.