న్యూఢిల్లీ, జూన్ 23 : ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆప్ జయభేరి మోగించింది. ఇక్కడ ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17,554 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. గోపాల్ ఇటాలియాకు 75,943 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కిరిత్ పటేల్‌కు 58,388 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రాన్పరయకు కేవలం 5,501 ఓట్లు పోలయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆప్ అభ్యర్థి భూపేంద్ర భయానీ గెలుపొందారు. అయితే 2023లో ఆయన పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, గుజరాత్‌లోని కడీ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని కాలీగంజ్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ 50వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఆశిష్ ఘోష్‌పై గెలుపొందారు. ఇక పంజాబ్‌లోని లూథియానా పశ్చిమ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా 10,637 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషుపై ఆయన విజయం సాధించారు. కేరళలోని నీలాంబర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ 11,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.స్వరాజ్‌పై 11,077 ఓట్ల ఆధిక్యంతో షౌకత్ గెలిచారు.