Karnataka RTC | బెంగళూరు, ఆగస్టు 5: వేతన సవరణతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్‌ల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధాన నగరాలైన బెంగళూరు, చిక్కమగళూరు, రాయచూర్, చిత్రదుర్గ, హుబ్బళి, ధార్వాడ్, బెలగావి, మంగళూరు, మైసూర్, తుమకూరు, హసన్, మడికేరి, శివమొగ్గ, కలబుర్గిలలోని డిపోల నుంచి బస్‌లు బయటకు రాలేదు. ఇదే అదనుగా ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకున్నాయి.
అయితే మధ్యాహ్నం దాటిన తర్వాత హైకోర్టు జోక్యంతో సమ్మెను ఆగస్టు 7వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. ఆ లోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, సమ్మెపై దాఖలైన పిల్‌ను అత్యవసరంగా విచారించిన న్యాయస్థానం వెంటనే సమ్మెను విరమించాలని ఆదేశించింది. అయితే తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందకపోయినా సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన నాలుగు యూనియన్ల నేతలు.. తక్షణం విధులకు హాజరు కావాలని సిబ్బందిని కోరారు. కాగా, ప్రజలకు అత్యవసరమైన రవాణా వ్యవస్థలో సమ్మెను చేపట్టడం పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సమ్మెను కొనసాగిస్తే కోర్టు ధిక్కారంగా భావించి యూనియన్ నేతలపై చర్య తీసుకుంటామని హెచ్చరించింది. సమ్మెను విరమించామంటూ తెలిపే అఫిడవిట్‌ను బుధవారం దాఖలు చేయాలని యూనియన్ నేతలను ఆదేశించింది.