నిజాయితీ, అందర్నీ ప్రేమించడం లాంటి వాటినే హిందూ ధర్మం నేర్పుతుందని, కానీ బీజేపీ, ఆరెస్సెస్ నేతలు మతం పేరుతో రాజకీయాలు నెరుపుతున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్ ధర్మ మార్గంలో లేవని, నిజాయితీని ఆచరించడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ వ్యత్యాసాన్ని చూపడానికే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానంపై కూడా ప్రియాంక మండిపడ్డారు. గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, టాయిలెట్లు కట్టివ్వగానే మహిళా సాధికారత అయిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు.
రాయ్‌బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ… స్వావలంబన మాత్రమే సాధికారత అవుతుందని స్పష్టం చేశారు. సాధికారత అంటే స్వావలంబనే. ఈ విషయాన్ని మహిళలు గ్రహించాలి. వారి వారి ప్రాధమ్యాలను మహిళలే నిర్ణయించుకోవాలి. వారి జీవితాన్ని వారే నడిపించుకోవాలి అని ప్రియాంక సూచించారు. ఆడపిల్లలను బాగా చదవించాలని, వారి జీవితాలను వారే నడిపించుకోడానికి చదువు ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇలా ప్రతి ఒక్క మహిళా ఆలోచించాలని, మహిళలందరికీ తాము అండగా నిలుస్తామని ప్రియాంక భరోసానిచ్చారు. అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక విషయాలను సమకూర్చడం లాంటివి ప్రభుత్వ విధులని, కానీ… యోగి ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయడంలో బిజీ అయిపోయిందని ప్రియాంక మండిపడ్డారు.