నాగపూర్: నిజమైన ‘సేవకుడి’కి అహంకారం ఉండదని, ప్రజాజీవితంలో హుందాతనంతో ఉంటాడని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిజమైన సేవకుడు మర్యాదతో ప్రజలకు సేవ చేస్తాడని చెప్పారు. లోక్సభ ఎన్నికల అనంతరం మొదటిసారిగా నాగపూర్లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో భాగవత్ మాట్లాడారు.
‘నేనే చేశాను, నా వల్లే సాధ్యమైంది’ అన్న అహంకారం లేని వ్యక్తికే సేవకుడిగా పిలిపించుకునే హక్కు ఉంటుందని అన్నారు. మరోవైపు అతి విశ్వాసంతో ఉన్న బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు లోక్సభ ఫలితాలు వాస్తవ పరిస్థితులను తెలియజేశాయని ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ పేర్కొంది. బీజేపీ నాయకులు చాలామంది ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభలో వెలిగిపోతున్నామన్న భ్రమలో ఉన్నారు తప్ప వీధుల్లో సామాన్యులు చెప్పే మాటలను వినడం లేదని వ్యాఖ్యానించింది.