నాగ్‌పూర్, డిసెంబర్ 15: కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్‌కు చెందిన అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తిరుగుబాటుకు దిగుతున్నాయి. ఈ నెల 28న ‘మహా మోర్చా’ (భారీ ర్యాలీ) నిర్వహించనున్నట్టు బీఎంఎస్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా బీకేఎస్ కూడా తన కార్యాచరణను విడుదల చేసింది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ‘కిసాన్ గర్జన’ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని బీకేఎస్ తెలిపింది. దీంతో సాగు కోసం తెచ్చిన అప్పు తీర్చ లేక, చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కక ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని, వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని విధించరాదని, కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తున్న పంట సాయాన్ని పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విధానం దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది. తద్వారా ఇటు ప్రజలు, అటు రైతులకు లాభం చేకూరుతుందని తెలిపింది. జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఈ కిసాన్ గర్జన నిరసన ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొంటారని బీకేఎస్ వెల్లడించింది.
విధాన సభ ముట్టడి
కేంద్రం అవలంబిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ 28న నాగ్‌పూర్‌లో మహా మోర్చా నిర్వహించనున్నట్టు బీఎంఎస్ ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విధాన సభను ముట్టడించి తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.