న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి రూ.758 కోట్లు విరాళమిచ్చి అతి పెద్ద దాతగా టాటా గ్రూపు అవతరించింది. గ్రూపులోని అన్ని సంస్థలు కలిపి ఒక్క బీజేపీకే 758 కోట్లు విరాళమివ్వగా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటే 2024-25లో టాటా గ్రూపు మొత్తం విరాళం దాదాపు రూ. 915 కోట్లుగా నిలిచింది. సడ్సిడీల రూపంలో రూ. 44,203 కోట్లు లభించేలా రెండు సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు టాటా గ్రూపు కేంద్ర క్యాబినెట్ ఆమోదం సంపాదించిన కొన్ని వారాలకే బీజేపీకి ఈ విరాళం ముట్టడం విశేషం. గుజరాత్, అస్సాంలో రెండు సెమీ కండక్టర్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు 2024 ఫిబ్రవరి 29న టాటా గ్రూపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 50 శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇది జరిగిన కొన్ని వారాలకే టాటా గ్రూపునకు చెందిన 15 కంపెనీల నుంచి రాజకీయ విరాళాలు ప్రవహించాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఈ విరాళాల పంపిణీ జరిగింది. సెమీకండక్టర్ యూనిట్ల స్థాపన ద్వారా తమకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా అధికార బీజేపీకి టాటా గ్రూపు నుంచి విరాళాలు అందినట్లు రాజకీయ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఏప్రిల్ 2న 10 రాజకీయ పార్టీలకు టాటా ట్రస్టు నుంచి రూ. 914.9 కోట్లు బదిలీ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రూ.757.6 కోట్లు బీజేపీ అందుకుంది.
కాంగ్రెస్ పార్టీకి రూ. 77.3 కోట్లు లభించగా మరో 8 ప్రాంతీయ పార్టీలకు రూ. 10 కోట్ల చొప్పున విరాళాలు లభించాయి. అయితే, బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలకు భారీ స్థాయిలో విరాళాలు బదిలీ చేసిన ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు 2021 నుంచి 2024 మధ్య క్రియాశీలంగా లేకపోవడమే దీనిపై అనుమానాలను లేవనెత్తుతోంది. ప్రభుత్వం నుంచి వేల కోట్లలో సబ్సిడీలు దక్కడం, అదే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీకి భారీ స్థాయిలో విరాళాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా 2025 అక్టోబర్‌లో తాము సమర్పించిన ఐటీ ఫైలింగ్‌లు నమోదైనట్లు టాటా ట్రస్టు వివరణ ఇచ్చుకుంది.
సెమీ కండక్టర్ యూనిట్లకు ప్రభుత్వం నుంచి రాయితీలు లభించినందుకు ప్రతిఫలంగా బీజేపీకి విరాళాలు లభించడం ఒక్క టాటా గ్రూపు కంపెనీలకే పరిమితం కాకపోవడం విశేషం. తమిళనాడులో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం మురుగప్ప గ్రూపుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. రూ.7,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌కు కేంద్రం నుంచి రూ.3,501 కోట్ల సబ్సిడీ లభించింది. ఈ ఆమోదం లభించిన వెంటనే బీజేపీకి మురుగప్ప గ్రూపు నుంచి రూ.125 కోట్ల విరాళం ముట్టింది. ఈ నమూనా ఇక్కడితో ఆగలేదు.
గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ ప్లాంట్ స్థాపనకు కేనెస్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2024 సెప్టెంబర్‌లో ఆమోదం లభించగా 2023-24లో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి రూ.12 కోట్ల విరాళం బీజేపీ ఖాతాలో పడింది. కాగా, పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వ మద్దతు, రాజకీయ పార్టీలకు విరాళాల మధ్య అవినాభావ సంబంధం ఉందన్న అనుమానాలకు ఈ ఉదంతాలు బలం చేకూరుస్తున్నాయి. కొవిడ్ సందర్భంగా సరఫరాలో అవాంతరాలు ఏర్పడడంతో భారత్ విదేశాల నుంచి చిప్‌లను దిగుమతి చేసుకోవడంపై ఎంతలా ఆధారపడిందన్న విషయం బట్టబయలైంది. దీంతో సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించిన మోదీ ప్రభుత్వం దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను ప్రకటించింది.