గాంధీధామ్, అక్టోబర్ 7: గుజరాత్లోని కచ్ తీర ప్రాంతంలో రూ.120 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గాంధీధామ్కు సమీపంలోని క్రీక్ అనే చోట 12 కిలోల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. స్మగ్లర్లు పట్టుబడకుండా ఉండటం కోసం ఈ కొకైన్ ప్యాకెట్లను అత్యంత రహస్యంగా ఓ చోట దాచి ఉంచారని తాము భావిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘గాంధీధామ్కు సమీపంలో క్రీక్ అనే ప్రాంతంలో కొకైన్ పట్టుబడటం ఇది మూడోసారి. చిన్న ఉపాయంతో దీన్ని పట్టుకున్నాం. ఆదివారం రాత్రి ఇక్కడ సోదాలు నిర్వహించగా 10 కొకైన్ ప్యాకెట్లు బయటపడ్డాయి’ అని అన్నారు. తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్, ఈ ఏడాది జూన్లో క్రీక్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది.