RRTS | రీజనల్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (RRTS)కు రెండు నెలల్లో రూ.415 కోట్లు చెల్లించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రకటనల కోసం రూ.1000కోట్లు ఖర్చు చేయగలిగినప్పుడు.. తప్పనిసరిగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం నిధులు సమకూర్చవచ్చు అంటూ జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనం మందలించింది. గత విచారణలో అయితే, ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ కోసం నిధులను ఖర్చు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.
దీంతో ధర్మాసనం గత మూడేళ్లలో చేసిన ప్రకటనల జారీ కోసం చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను రెండువారాల్లోగా ఇవ్వాలని గతంలో ఆప్ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. రీజనల్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న రైలు కారిడార్. దీని పొడువు 82 కిలోమీటర్లు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.31,632కోట్లు. ఈ మార్గంలో సెమీ హైస్పీడ్ రైళ్లు నడవనున్నాయి. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ర్యాపిడ్ఎక్స్ (RapidX) ప్రాజెక్ట్ ఫేజ్-I కింద ఉన్న మూడు ర్యాపిడ్ రెడ్ కారిడార్లలో ఇదీ ఒకటి. అయితే, ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించేందుకు ససేమిరా అనడంతో సుప్రీంకోర్టు మందలించింది.