న్యూఢిల్లీ, ఆగస్టు 20: ల్యాటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్రంలోని 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులతో భర్తీ చేయడానికి ఇటీవల ఇచ్చిన ప్రకటనను మంగళవారం యూపీఎస్సీ రద్దు చేసింది.
ఈ ప్రకటనను రద్దు చేయాలని అంతకుముందు యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుదన్కు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. ఆగస్టు 17న ల్యాటరల్ ఎంట్రీపై యూపీఎస్సీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పద్ధతిలో నియామకాలు జరపడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల హక్కులు దూరమవుతాయనే వివాదం మొదలయ్యింది.
ప్రతిపక్షాలతో పాటు ఎన్డీయే పక్షమైన లోక్ జనశక్తి(రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం ల్యాటరల్ ఎంట్రీ ప్రకటనను వ్యతిరేకించారు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం వెనక్కు తగ్గక తప్పలేదు. కాగా, ల్యాటరల్ ఎంట్రీ విధానంలో రిజర్వేషన్ల అమలు అవకాశాలను కేంద్రం పరిశీలించనున్నదని తెలుస్తున్నది.
‘వెనుకబడిన వర్గాలు(పిచ్డే), దళితులు, అల్పసంఖ్యాకుల’(పీడీఏ) ఐక్యతకు కేంద్రం తలొగ్గిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ‘రిజర్వేషన్లను తిరస్కరించి యూపీఎస్సీలో ల్యాటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు చేపట్టాలనుకున్న కుట్ర పీడీఏ ఐక్యత ముందు తలొగ్గింది. ఇప్పుడు బీజేపీ కుట్రలు విజయవంతం కావడం లేదు. పీడీఏలో వచ్చిన అవగాహన, మేలుకొలుపు సాధించిన పెద్ద విజయం ఇది’ అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
నియంతృత్వ రాజ్యం పొగరును రాజ్యాంగశక్తి ఓడిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ల్యాటరల్ ఎంట్రీ లాంటి బీజేపీ కుట్రలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం చేస్తామని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల వ్యవస్థను కాపాడతామని రాహుల్ గాంధీ అన్నారు. ల్యాటరల్ ఎంట్రీ రద్దుతో తమ ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పిందని, భవిష్యత్తులోనూ ప్రభుత్వాలు ప్రజల భావోద్వేగాల పట్ల ఇంతే సున్నితత్వాన్ని చూపించాలని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.