న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన భార్య, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేయాలని వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆకాంక్షించారు. ఆమె లోక్‌సభలోకి వస్తే ప్రజలు సంతోషిస్తారన్న వాద్రా ప్రియాంక గాంధీని యూపీలోని అమేధి లేదా సుల్తాన్పూర్ నుంచి బరిలో నిలపాలని కోరారు. ప్రియాంక ముందు పార్లమెంట్లో అడుగుపెడితే ప్రజలు సంతోషిస్తారని, అమేధి లేదా సుల్తాన్పూర్ ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తుందో ఆ స్ధానం నుంచి ఆమెను ఎన్నికల బరిలో నిలపాలని అన్నారు.
ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన అమేధిలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. ఇక సుల్తాన్పూర్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారని కష్టపడి పనిచేస్తున్న ఆమె సేవలను హైకమాండ్ గుర్తించాలని వాద్రా పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ప్రియాంకను అనుసరిస్తానని, తన కంటే ముందు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టాలని కోరుకుంటానని చెప్పారు. ప్రియాంక కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాబోరని పార్లమెంట్‌లోనూ అడుగుపెట్టేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వాద్రా పేర్కొన్నారు.
Read More :