న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన నేపధ్యంలో కాషాయ పార్టీ లక్ష్యంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి పాలక బీజేపీ గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని వాద్రా దుయ్యబట్టారు. గతంలో తననూ పలుమార్లు ఆదాయ పన్ను శాఖ విచారణ పేరుతో ప్రశ్నించిందని వాద్రా గుర్తుచేశారు. రాజకీయ ప్రత్యర్ధులపై పాలక బీజేపీ దర్యాప్తు సంస్ధలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టడంపై ఆ పార్టీ నేత కార్తీ చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను, బారికేడ్లను ఏర్పాటు చేశారని బుల్డోజర్లు ఒక్కటే మిస్ అయ్యాయని వ్యాఖ్యానించారు. మైనారిటీ మతాన్ని ఆచరించే వ్యక్తులను, ఇండ్లను ధ్వంసం చేసే పనిలో బుల్డోజర్లు బిజీగా ఉండి ఉంటాయని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ ఈడీ విచారణకు భారీ ప్రదర్శగా హాజరయ్యేందుకు సన్నద్ధమవగా ఢిల్లీ పోలీసులు అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ను విధించారు. ఇక ఇదే కేసులో జూన్ 23న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
మైనారిటీ మతాన్ని విశ్వసించే వారి ఇండ్లు, జీవితాలను ధ్వంసం చేసే పనిలో బిజీగా ఉండటంతోనే వాటిని కాంగ్రెస్ కార్యాలయం వద్దకు తీసుకురాలేదని కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ప్రయాగ్రాజ్లో జరిగిన హింసాత్మక ఘటనల సూత్రధారి ఇంటిని ప్రయాగరాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) కూల్చివేసిన నేపధ్యంలో కార్తీ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.