న్యూఢిల్లీ: పంట వ్యర్థాల వల్ల దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కలుషితమవుతున్నదనే ఆరోపణలకు ఇక చెల్లు! త్వరలోనే ఈ వ్యర్థాలు నాణ్యమైన రోడ్లుగా మారవచ్చు. వరి దుబ్బులు, ఇతర పంటల వ్యర్థాలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే మెటీరియల్‌గా మార్చగలిగే కొత్త బయో-బిటుమెన్ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతున్నది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బుధవారం అధికారికంగా ఈ టెక్నాలజీని 14 కంపెనీలకు బదిలీ చేశారు.
భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్)కు చెందిన కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ (సీఆర్ఆర్ఐ) శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, బయోబిటుమెన్తో నిర్మించిన రోడ్లు సంప్రదాయ బిటుమెన్ రోడ్లకు సరిసాటిగా ఉంటాయని, కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ పటిష్టంగా ఉంటాయని తెలిపారు. ఈ రోడ్లు పగుళ్లుబారవని, గుంతలు పడవని, ఢిల్లీలోని తీవ్రమైన వేసవి వేడిని సైతం నిరోధించగలవని తెలిపారు. సీఆర్ఆర్ఐ శాస్త్రవేత్లు జీ భరత్, అంబిక బెహల్ 2021 నుంచి ఈ టెక్నాలజీ కోసం కృషి ప్రారంభించారు. వీరి కృషికి ఫలితం 2024లో లభించింది. మేఘాలయలో తొలి బయో బిటుమెన్ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు రెండు వర్షాకాలాలకు తట్టుకుని నిలిచింది. ఇప్పటికీ హైవే క్వాలిటీతో ఉంది.