Road accident : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిల్గిట్ బాల్టిస్థాన్ ఏరియాలోని దియామెర్ జిల్లాలో 41 మందితో ఇరుకైన కొండ మార్గంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. కారాకోరమ్ రహదారిపై యశోఖాల్ ఏరియాలో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.