పాట్నా : రానున్న బీహార్ శాసన సభ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లోనూ ఆర్జేడీ పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ చెప్పారు. ముజఫర్పూర్ జిల్లాలోని కంటి పట్టణంలో ఆదివారం జరిగిన ఆర్జేడీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకంలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తేజస్వి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సాధించిన విజయాలను వివరించారు. ఆర్జేడీ పోటీ చేయబోతున్న కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా ఆయన చెప్పారు. వీటిలో ఒకదానిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. సీట్ల పంపకాల చర్చల్లో మిత్ర పక్షాలపై ఒత్తిడి పెంచడం కోసమే ఆయన ఈ విధంగా ప్రకటించారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీఐపీ, జేఎంఎం, ఎల్జేపీ (పరాస్ వర్గం) ఉన్నాయి. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను ఆశిస్తున్నట్లు సమాచారం.