న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్‌లపై ఐఆర్సీటీసీ స్కామ్‌లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు చేసింది. మోసం చేయడం కోసం పబ్లిక్ సర్వెంట్‌గా తన పదవిని దుర్వినియోగపరచారని, కుట్రలో పాలుపంచుకున్నారని లాలూపై ఆరోపణలను నమోదు చేసింది. రబ్రీ దేవి, తేజస్విలు మోసం చేయడానికి కుట్ర చేశారని అభియోగాలు నమోదు చేసింది.
లాలూ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా పని చేశారు. అప్పుడు ఐఆర్సీటీసీ హోటళ్లు బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీల మెయింటెనెన్స్ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాంట్రాక్టులను ఇచ్చినందుకు లాలూ పాట్నాలో సుమారు 3 ఎకరాల భూమిని బినామీ కంపెనీ ద్వారా పొందినట్లు సీబీఐ చార్జిషీటు పేర్కొంది. ఈ టెండరును అనుకూలంగా మార్చుకోవడానికి లాలూ పదవిని దుర్వినియోగం చేశారని కోర్ట్ పేర్కొంది.