Misa Bharti : నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి మోదీ సర్కార్ మాట్లాడటం లేదని ఆర్జేడీ ఎంపీ మిసా భారతి ఆరోపించారు. వక్ఫ్ బిల్లుతో ఓ మతాన్ని టార్గెట్ చేయడం సరైంది కాదని అన్నారు. వక్ఫ్ బిల్లును విపక్ష ఇండియా పార్టీలు, ఆర్జేడీ తీవ్రంగా వ్యతిరేకిస్తాయని స్పష్టం చేశారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును జేఎంఎం ఎంపీ మహువ మాఝి వ్యతిరేకించారు. ఓ నిర్ధిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకోరాదని ప్రభుత్వానికి హితవు పలికారు.
ప్రజలు విరాళంగా ఇచ్చిన భూములను తిరిగి తీసుకునేందుకు మీరెవరని ఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ ప్రశ్నించారు. మొదటి నుంచి ప్రభుత్వ ఉద్దేశం ఇదేనని అన్నారు. బీజేపీ తన పేరును మార్చుకోవాలని, ఆ పార్టీని భారత భూములను లాగేసుకుని వారికి ఇష్టమైన వారికి పంచే పార్టీగా పిలవాలని అన్సారీ వ్యాఖ్యానించారు.
ఇక లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. ఈ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే నిబంధనను తీసుకొస్తున్నారని అన్నారు. ఇది మత స్వేచ్ఛపై నేరుగా చేపట్టిన దాడేనని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Diamond Firm | ఆర్థిక మాంద్యం భయాలు.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సూరత్ డైమండ్స్ సంస్థ