Diamond Firm | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని సూరత్ (Surat) నగరం బట్టలకే కాదు డైమండ్స్‌కు కూడా ప్రసిద్ధి (Diamond Firm) అన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అక్కడి డైమండ్ పాలిషింగ్ సంస్థలను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. కొన్ని సంస్థలపై ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానపెట్టిన వజ్రాలకు (polished diamonds) డిమాండ్ పడిపోవడంతో.. కంపెనీల వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిల్వలను తగ్గించేందుకు పలు సంస్థలు జాగ్రత్తపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద నేచురల్ డైమండ్స్ కంపెనీగా పేరొందిన కిరణ్ జెమ్స్ అనే కంపెనీ (Kiran Gems company).. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ తగ్గిందని పేర్కొంటూ తన ఉద్యోగులకు పదిరోజుల పాటు సెలవులు ఇచ్చింది. సంస్థలో పనిచేసే 50,000 మంది ఉద్యోగులకు ఈ నెల 17 నుంచి 27 వరకు సెలవు ప్రకటించింది. అంతేకాదు వారికి ఈ రోజులకు జీతం కూడా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. వజ్రాల వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్‌ను అధిగమించడానికి ఉత్పత్తిని నియంత్రించే సాధనంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
వజ్రాల పరిశ్రమ కఠినమైన ఇబ్బందుల్లో ఉందని, ప్రపంచ మార్కెట్లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కిరణ్ జెమ్స్ కంపెనీ తెలిపింది. ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా తమ ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించామని, కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు. కాగా, సూరత్‌లో దాదాపు 4,000 పెద్ద, చిన్న డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అందులో సుమారుగా 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక మాంద్యం ముదిరితే వీరంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read..
Waqf Bill | వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
PM Modi | వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
Protests | కూరగాయల ధరల పెరుగుదలపై విపక్షాల ఆందోళన.. ఉల్లిపాయల దండతో ఎంపీల నిరసన