పాట్నా: ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తేజస్వీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వీల్ చైర్లో రావడంతో ఆయనకు ఏమైందని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన సోదరుడు తేజ్ ప్రతాప్‌తో కలిసి తేజస్వీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం తన సహాయకుని సహకారంతో కారులో నుంచి దిగిన ఆయన వీల్ చైర్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై పార్టీ కానీ, ఆయన కానీ ఇంతవరకు స్పందించలేదు. కాగా, అంతకుముందు అదే పోలింగ్ కేంద్రంలో తన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, సోదరి రోహిణి ఆచార్య కూడా ఓటువేశారు.
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో భాగంగా ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. ఇందులో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దశలో బీహార్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతున్నది. ఈ నెల 4న ఫలితాలు వెలువడనున్నాయి.