న్యూఢిల్లీ, జూన్ 8: నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రాజ్యాంగ సంస్థలు హైజాక్ అయ్యాయని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆదివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే బీజేపీ ఐటీ సెల్‌కి ఆ విషయం తెలిసిపోతుందని, దీనిపై తాము ఓ కన్నేసి ఉంచామని విలేకరులతో మాట్లాడుతూ తేజస్వీ అన్నారు. రాజ్యాంగ సంస్థలు నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అవి ఒత్తిళ్లకు లొంగిపోతే ఇక న్యాయం ఎవరికీ దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఆయన సమర్థించారు.
2020 బీహార్ ఎన్నికలను తేజస్వీ ప్రస్తావిస్తూ 2020 ఎన్నికల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అయితే తన వాదనను సమర్థించుకోవడానికి ఎన్నికల కమిషన్ మూడుసార్లు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ‘సాయంత్రం ఓట్ల లెక్కింపును ఎందుకు నిలిపివేశారు? రాత్రి మళ్లీ ఎందుకు ప్రారంభించారు? మొదట్లో విజేతలుగా ప్రకటించిన పేర్లను ఆ తర్వాత పరాజితులుగా ఎందుకు ప్రకటించవలసి వచ్చింది?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకి, దాని మిత్రపక్షమైన బీజేపీకీ వ్యతిరేకంగా పోరాడే ప్రతిపక్ష కూటమికి తేజస్వీ యాదవ్ నాయకత్వం వహించనున్నారు.
మోదీ ఒక జోక్..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆదివారం ఎక్స్‌లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌ను ఒంటరిని చేయడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఇది మోదీ భారత సైనికులకు, దేశ ప్రజలకు చేసిన నేరపూరిత ద్రోహంగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధానిగా 11 ఏండ్లలో మోదీ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించ లేదని తెలిపారు. ఆయన పదవీ కాలం ముగియనుందని.. ఆయన రాజకీయాలు ప్రపంచ వ్యాప్తంగా బహిర్గత మయ్యాయని తెలిపారు.
మోదీ పాలన కుంటుపడిందని.. ఆయన రాజకీయాలు బెడిసికొట్టాయని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ దేశంపై పటిష్ఠ చర్యలుంటాయని అందరూ భావించారని.. కానీ వాస్తవానికి పాకిస్థాన్ దౌత్య పరంగా, సైనికపరంగా లబ్ధి పొందుతూనే ఉందని చెప్పారు. పాక్‌కు చైనా ఆయుధాలు సమకూరుస్తున్నదని.. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లు రుణాలు మంజూరు చేస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదానికి కేరాఫ్‌గా ఉన్న పాకిస్థాన్‌ను ఐరాస భద్రతా మండలిలో ఉగ్రవాద వ్యతిరేక కమిటీ వైస్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని… ఇవన్నీ ప్రధాని మోదీ ఘోరమైన దౌత్య వైఫల్యాలేని ఆయన తీవ్రంగా విమర్శించారు.