న్యూఢిల్లీ, జనవరి 12: సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఆయనను దవాఖానకు తీసుకొచ్చారని, తాము ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ దవాఖాన ఓ ప్రకటనలో తెలిపింది. సోషలిస్టు దిగ్గజం జయప్రకాశ్ నారాయణ్‌కు అనుచరుడైన శరద్‌యాదవ్.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2003లో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన జనతాదళ్(యునైటెడ్)కు తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2016 వరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం నితీశ్‌తో పొసగకపోవడంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు.
జేపీ ఎంపిక చేసిన తొలి అభ్యర్థి
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా బాబయి గ్రామంలో 1947 జూలై 1న శరద్‌యాదవ్ జన్మించారు. తండ్రి నందకిశోర్ యాదవ్. తల్లి సుమిత్రా యాదవ్. మధ్యప్రదేశ్‌లో జన్మించినా శరద్ యాదవ్ రాజకీయ జీవితం ప్రధానంగా బీహార్ కేంద్రంగానే సాగింది. 1974లో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేపీ ఎంపిక చేసిన తొలి అభ్యర్థి శరద్యాదవే కావడం విశేషం. అనంతరం 1977లో అదే స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. 1979లో జనతాపార్టీ విడిపోయినప్పుడు ఆయన చరణ్‌సింగ్ పక్షాన చేరారు. 1981లో అమేథీలో రాజీవ్‌గాంధీపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1984లో బదౌన్‌లో ఓటమిపాలయినా.. 1989లో అదే స్థానం నుంచి గెలుపొందారు. అనంతరం బీహార్‌లోని మాదేపురా నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా
1994-2004 మధ్య అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో శరద్‌యాదవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జేడీయూ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో పార్టీ అధినేత నితీశ్‌కుమార్ ఆయనను రాజ్యసభకు పంపారు. అనంతరం 2009లో మాదేపురా నుంచి తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో జేడీయూ ఘోర పరాభవం చవిచూడటంతో నితీశ్, శరద్‌యాదవ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2017లో బీజేపీతో తిరిగి జట్టుకట్టాలని నితీశ్ నిర్ణయం తీసుకోవడాన్ని శరద్ యాదవ్ వ్యతిరేకించారు. అనంతరం నితీశ్‌తో తెగదెంపులు చేసుకొని, 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 2022 మార్చిలో తన పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.
కేంద్ర మాజీ మంత్రి శరద్‌యాదవ్ మృతిపట్ల సీఎం కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శరద్‌యాదవ్ అందించిన మద్దతును స్మరించుకున్నారు.