న్యూఢిల్లీ: భారత్లో 2001-2019 మధ్య కాలంలో అధిక ఎండలు, చలి కారణంగా కనీసం 35 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనం వెల్లడించింది. టెంపరేచర్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఒక్క 2015లోనే వడదెబ్బ కారణంగా 1,907 మంది, తీవ్రమైన చలి వల్ల 1,417 మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనం తెలిపింది. అయితే తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల కలిగే మరణాలను, అనారోగ్య ప్రభావాలను నివారించొచ్చని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయన ప్రధాన రచయిత ప్రదీప్ గుయిన్ తెలిపారు.
పనిచేసే వయసులో ఉన్నవారే వడదెబ్బ వల్ల ఎక్కువగా చనిపోతున్నారని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లో మరణాలు 3-5 రెట్లు, తీవ్రమైన చలి వల్ల సంభవించిన మరణాలు 4-7 రెట్లు పెరిగాయని పరిశోధకులు తెలిపారు.