న్యూఢిల్లీ : కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన క్రమంలో ఢిల్లీలో కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో సోమవారం కరోనా పాజిటివిటీ రేటు గత రెండు నెలల గరిష్టస్ధాయిలో 2.70 శాతంగా నమోదైంది. పలు స్కూళ్లలో కరోనా కేసులు బయటపడటంతో పొరుగున ఉన్న జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో పాఠశాలలు మూతపడ్డాయి.
కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదని, పరిస్ధితి అదుపులోనే ఉందని అవసరమైతే తగిన చర్యలు చేపడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నూతన కరోనా వేరియంట్ బయటపడలేదని, కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.
ఢిల్లీలో రోజువారీ కేసులు 100 నుంచి 200 వరకూ వెలుగుచూస్తున్నాయని ఆస్పత్రుల్లో చేరికల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోందని అన్నారు. పాజిటివిటీ రేటు పెరుగుదలపై ఈ దశలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ఐదు రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణపై దృష్టిసారించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు.