Bangladesh | న్యూఢిల్లీ : అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అల్లరి మూకలు హిందూ టీచర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని చెప్తున్నారు. ఆగస్టు 29న కొందరు విద్యార్థులు, ఇతర నిరసనకారులతో కలిసి బరిషల్లోని బాకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీలోకి దూసుకెళ్లి ప్రిన్సిపాల్ శుక్లారాణి హైదర్‌తో వాగ్వివాదానికి దిగి రాజీనామాకు డిమాండ్ చేశారు.
చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడంతో ఖాళీ పేపర్‌పై ‘నేను రాజీనామా చేస్తున్నాను’ (ఐ రిజైన్) అని రాసిచ్చి వెళ్లిపోయారు. ఆగస్టు 18న దాదాపు 50 మంది విద్యార్థులు అజీంపూర్ ప్రభుత్వ బాలికల స్కూల్, కాలేజీలోకి చొరబడి ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్రపాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్‌తో రాజీనామా చేయించారు. ఇవేకాదు, ఇలాంటి బలవంతపు రాజీనామాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.