తిరువణ్ణామలై: కడుపున పుట్టిన బిడ్డలు అవమానించారని తన ఆస్తులన్నీ ఆలయానికి రాసిచ్చాడు ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి పట్ణణానికి సమీపంలోని కేశవపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి విజయన్(65)కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆస్తి పంపకాల విషయంలో బిడ్డలు గొడవపడటం, వారు తనను తరచూ దూషిస్తుండటం, రోజువారీ అవసరాలు కూడా తీర్చకపోవడంతో విజయన్ కలత చెందాడు. తన పేరిట ఉన్న రూ. 4 కోట్ల విలువ చేసే రెండు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో అరుణిగు రేణుగంబాల్ అమ్మన్ ఆలయానికి చేరుకున్నాడు. ఆలయంలోని హుండీలో వాటిని వేశాడు. ఈ నెల 24న ఆలయ అధికారులు, సిబ్బంది ఈ హుండీని తెరిచి కానుకలను లెక్కిస్తుండగా, ఈ విషయం బయటకు వచ్చింది. ఆలయ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఆలయంలో ఇలా మొదటిసారి జరిగిందని, ఉన్నతాధికారులతో మాట్లాడాకే ఓ నిర్ణయం చెప్తామని ప్రకటించారు. అయితే వీటిని వెనక్కి తీసుకునేందుకు విజయన్ కూతుళ్లు ప్రయత్నించారు. దీనికి ఆలయ నిబంధనలు ఒప్పుకోవని అధికారులు తేల్చిచెప్పారు. ఆలయానికి ఇచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, కనిపెంచిన బిడ్డలే తనను తీవ్రంగా అవమానించారని విజయన్ పేర్కొన్నారు.