Republic Day 2024 | ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఎంతో కీలకమైంది. భారత రాజ్యాంగం అధికారికంగా 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారింది. శాంతిభద్రతలు సజావుగా సాగేందుకు దేశ రాజ్యాంగమే ఆధారం. దేశం మొత్తం న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ఆధారంగానే నడుస్తున్నది. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి పలు హక్కులు కల్పించగా.. విధులు సైతం నిర్దేశించింది.
అయితే, దేశం మొత్తం రాజ్యాంగం, చట్ట పరిధిలోకి వచ్చింది. అయితే, రాజ్యాంగ, చట్టాలు వర్తించని గ్రామం సైతం ఒకటున్నది. ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం ఉన్నది. అలాగే సొంత న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ ఉన్నాయి. సొంత పార్లమెంట్ ఉండగా.. ప్రజలతో ఎన్నుకోబడిన సభ్యులుంటారు. ఈ గ్రామం ఎక్కడో దేశ సరిహద్దుల్లో.. కేంద్ర పాలిత ప్రాంతం కిందకో రాదు. దేశంలోనే అంతర్భామే. మరి ఆ గ్రామం ఎక్కడుంది ? ఆ గ్రామంలో జీవనశైలి ? అక్కడ ఉన్న ఆంక్షలు ఏంటీ? అన్నది తెలుసుకుందాం రండి..!
భారతదేశంలో చాలా విచిత్రమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఇందులో ఒకలి మలానా గ్రామం. ఈ గ్రామం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నది. ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం, పార్లమెంట్ ఉంది. భారతీయ చట్టాలేవీ ఇక్కడ వర్తించవు. గ్రామ ప్రజలు సొంత నియమాలను మాత్రమే పాటిస్తారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సొంత శిక్షలు విధిస్తారు. గ్రామానికి దాని సొంత పార్లమెంట్ ఉండగా.. అన్ని నిర్ణయాలను అదే తీసుకుంటుంది. మలానా గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే కులు నుంచి 45 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందు కసోల్, మలానా జలవిద్యుత్ ప్లాంట్ మీదుగా మణికరణ్ మార్గంలో వెళ్లాలి. అయితే, ఇక్కడికి చేరుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. హిమాచల్ ట్రాన్స్పోర్ట్కు చెందిన ఒక మాత్రమే ఈ గ్రామానికి వెళ్తుంది. కులు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది.
మలానా గ్రామం పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. గ్రామానికున్న విశిష్టత, చరిత్ర, ఇక్కడి నియమాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అయితే, పర్యాటకులకు గ్రామంలో ఉండేందుకు మాత్రం అవకాశం లేదు. గ్రామంలో ఉన్న నియమాల్లో ఒకటి.. బయటి వ్యక్తులు గ్రామంలో ఉండకూడదు. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు గ్రామం వెలుపల గుడారాలు వేసుకొని ఉంటారు. గ్రామంలోని నియమాలు చిత్రంగా అనిపిస్తాయి. గ్రామ గోడను తాకడం నిషేధం. బయటి నుంచి వచ్చే వ్యక్తులెవరూ గామం గోడను కూడా తాకకూడదు.. దాటకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటకులు గ్రామం వెలుపల గుడారాలు వేసుకొని ఉండాల్సి ఉంటుంది.
మలానా గ్రామం భారతదేశంలో భాగమైనప్పటికీ.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ఒకే గ్రామం సొంత న్యాయవ్యవస్థను కలిగి ఉంటుంది. గ్రామానికి సొంత పార్లమెంట్ ఉంటుంది. ఇక్కడ రెండు సభలున్నాయి. ఎగువ సభను జ్యోతంగ్.. దిగువ సభను కనిష్తాంగ్గా పిలుస్తారు. జ్యోతంగ్లో 11 మంది సభ్యులుంటారు. వారిలో ముగ్గురు కర్దార్, గురు, పూజారి శాశ్వత సభ్యులుగా ఉంటారు. మిగిలిన ఎనిమిది మంది సభ్యులను గ్రామస్తులు ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. జూనియర్ హౌస్‌లో గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడు ప్రతినిధి ఉంటారు. ఇక్కడ పార్లమెంట్ హౌస్ రూపంలో ఒక చారిత్రక చౌపాల్ ఉంది. ఇక్కడే వివాదాలన్నీ పరిష్కరిస్తారు.