Priyanka Gandhi : కేంద్ర ప్రభుత్వం (Union Govt) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడంవల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇలాంటి చర్యలతో డబ్బు ఖర్చు తప్ప మరే ఉపయోగం లేదని విమర్శించారు. వంద రోజులు ఉపాధి కల్పించడం ద్వారా పల్లెప్రాంత పేదల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం కోసం ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి ఇప్పుడు పేరు మార్చాల్సిన అవసరం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. పథకం పేరు మార్చితే.. దానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు, వస్తువులపై ఇప్పటికే ముద్రించిన పేర్లను మార్చాల్సి వస్తుందని ప్రియాంకాగాంధీ అన్నారు.
ఇది ఖరీదైన ప్రక్రియ అని, చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆమె చెప్పారు. కాగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది.