న్యూఢిల్లీ, జూలై 2: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సోమవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు. దీంతో ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ స్పీకర్‌కు మంగళవారం రాహుల్ గాంధీ లేఖ రాశారు. లోక్‌సభ 380 నిబంధనలో పేర్కొన్న అంశాలను మాత్రమే తొలగించాలని, తన వ్యాఖ్యలు ఈ నిబంధన కిందకు రాకపోయినా రికార్డుల నుంచి తొలగించారని రాహుల్ ఆరోపించారు.
తన వ్యాఖ్యలు తొలగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిబంధనలకు వ్యతిరేకమని ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగంలో మాత్రం కేవలం ఒకే ఒక్క పదాన్ని మాత్రమే తొలగించడం చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. రికార్డుల నుంచి తొలగించిన తన ప్రసంగాన్ని తిరిగి చేర్చాలని స్పీకర్‌ను కోరారు.